: ఇవి క్యాన్సర్ కణాలను చంపేస్తాయి
క్యాన్సర్ వ్యాధి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. అయితే ఇందులో ప్రత్యేకతేమంటే ప్రధాన కణితులు మాత్రం క్యాన్సర్ కారక మరణాలకు కారణం కాదు. వాటినుండి పట్టుకొచ్చి ఇతర శరీర భాగాలకు వ్యాపించే పిల్ల కణితులే మనుషుల మరణానికి కారణం అవుతుంటాయి. వీటిని శరీరంలో కనుగొనడం కొద్దిగా కష్టమైనపని. కానీ ఇలాంటి పిల్ల క్యాన్సర్ కణాలను కూడా పట్టుకొని వాటిని సమూలంగా నాశనం చేసే ఒక కొత్తరకం తరహా వైద్యాన్ని మిసౌరీ విశ్వవిద్యాలయం పరిశోధకులు కనుగొన్నారు. శరీరంలో క్యాన్సర్ కణాలను నాశనం చేసే రేడియో ధార్మిక నానో పార్టికల్స్‌ను వీరు రూపొందించారు. ల్యూటీనియం మూలకం రేడియో థార్మిక రూపం నుండి ఈ నానోపార్టికల్స్‌ను రూపొందించారు.
క్యాన్సర్ చికిత్స విజయవంతం కావడం అనేది క్యాన్సర్ పిల్ల కణాలు ఇతర భాగాలకు వ్యాపించకుండా నిరోధించడం అనే విషయంపై ఆధారపడి ఉంటుందని, ఈ చికిత్సలో ఇదే కీలకమని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన మైఖేల్ లేవిన్ తెలిపారు. క్యాన్సర్ల రకాలను బట్టి ప్రధాన క్యాన్సర్ కణితులు రోగి మరణానికి దోహదం చేయవని, ఇతర భాగాలకు వ్యాపించే పిల్ల ట్యూమర్లే ప్రాణాంతకంగా పరిణమిస్తుంటాయని వివరించారు. తాము తయారు చేసిన నానో పార్టికల్స్ పనితీరును జంతువులపై ప్రయోగించారు.
బంగారు తొడుగులో ల్యూటీనియం నానో పార్టికల్స్‌ను కూర్చి, వాటిని క్యాన్సర్ కణితుల వద్దకు మోసుకుపోయే కారకాలను జోడించారు. ఈ కారకాలు ఆరోగ్యంగా ఉన్న కణాలను కాకుండా క్యాన్సర్ కణాలను అంటిపెట్టుకొని వాటిని మాత్రమే నిర్మూలించినట్టు తమ పరీక్షలో తేలిందని ఆయన తెలిపారు. ఈ పరిశోధన పూర్తిరూపం దాలిస్తే త్వరలోనే క్యాన్సర్ చికిత్స విధానంలో మరింత మెరుగైన చికిత్స రోగులకు అందుబాటులోకి వస్తుంది!