: క్షయకు విరుగుడు 'సి' విటమిన్
క్షయ వ్యాధిని 'సి' విటమిన్‌తో నిర్మూలించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. న్యూయార్క్‌కు చెందిన అల్బర్ట్ ఐన్‌స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం క్షయ వ్యాధి నివారణకు ప్రస్తుతం చేస్తున్న పరిశోధనల్లో ఈ సరికొత్త విషయాన్ని కనుగొన్నారు. వారు ప్రయోగ శాలలో పెంచిన క్షయ వ్యాధి కారకమైన మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ను 'సి' విటమిన్‌తో విజయవంతంగా నిర్మూలించగలిగారు.
ప్రస్తుతం క్షయ వ్యాధి నిర్మూలనకు ఉపయోగిస్తున్న ఐసోనియాజిడ్ మందుకు క్షయ బాక్టీరియా నిరోధకతను పొందింది. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు. వీరు చేస్తున్న పరిశోధనల్లో ఈ విషయం యాదృచ్ఛికంగా బయటపడింది. అయితే 'సి' విటమిన్ క్షయ కారక బ్యాక్టీరియాను చంపడానికి కారణాలను ఇంకా కనుగొనాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాము కనుగొన్న ఈ సరికొత్త విషయం భవిష్యత్తులో క్షయవ్యాధి నివారణకు సమర్ధవంతమైన, చవకైన ఔషధాలను రూపొందించేందుకు ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.