: క్యాన్సర్‌ థెరపీలకు ఇక జుట్టు ఊడిపోదు...!


క్యాన్సర్‌ వ్యాధి భయంకరమైనది. ఇది సోకిన వారికి చేసే చికిత్సల్లో రేడియోథెరపీ, కీమోథెరపీలు ముఖ్యమైనవి. అయితే ఈ చికిత్సలు చేసినపుడు రోగికి జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. అయితే సాయంకాల సమయాల్లో ఈ చికిత్సలు చేసినట్టైతే జుట్టు ఊడడం తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాల్క్‌ ఇన్‌స్టిట్యూట్‌ పర్‌ బయోలాజికల్‌ స్టడీస్‌, దక్షిణ కాలిఫోర్నియా యూనివర్సిటీ, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. ఎలుకలపై చేసిన ఈ పరిశోధనాబృందంలో భారత సంతతికి చెందిన సచ్చిదానంద పాండా ఉన్నారు. ఈ పరిశోధనలో ఎలుకల్లోని వెంట్రుకల్లో 24 గంటల శరీర గడియారం ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గడియారం ఖచ్చితమైన సమయంతోబాటు దాని పనితీరు వెనకున్న జీవశాస్త్రాన్ని కూడా వారు ఆవిష్కరించారు.

శరీరంలోని వెంట్రుకలు ఎప్పుడు పెరగాలో, ఎప్పుడు మరమ్మతులు చేయాలో కూడా సూచించే ప్రక్రియను వారు గుర్తించారు. ఈ ప్రక్రియను రేడియేషన్‌ థెరపీని ఉపయోగించి పరీక్షించారు. ఉదయం సమయంలో రేడియేషన్‌ థెరపీని ఇచ్చినపుడు ఎలుకలు 85 శాతం మేర వెంట్రుకలను కోల్పోయాయి. సాయంకాలం వేళ రేడియేషన్‌ థెరపీని ఇచ్చినపుడు అవి కేవలం 17 శాతం మాత్రమే వెంట్రుకలను నష్టపోయాయి.

రేడియేషన్‌ చికిత్స విధానం వల్ల వేగంగా అభివృద్ధి చెందే కణాల్లోని డిఎన్‌ఏ దెబ్బతింటుంది. దీన్ని వేగంగా కణాలు అభివృద్ధి చెందే క్యాన్సర్‌ నివారణలో వాడుతారు. అయితే ఉదయం పూట ఇచ్చిన ఈ చికిత్సల వల్ల వెంట్రుకల కణాల్లోని డిఎన్‌ఏకు కూడా నష్టం జరుగుతుంది. ఈ డీఎన్‌ఏకు సాయంత్రం వరకూ మరమ్మత్తు జరగదు. అదే సాయంత్రాలు ఈ చికిత్స చేసినట్టయితే వెంటనే వెంట్రుకల డిఎన్‌ఏ మరమ్మతు మొదలై ఉంటుంది. దీంతో జుట్టు ఊడడం కూడా తక్కువగా ఉంటుందనే విషయం శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన మాక్సిమ్‌ లికన్‌ మాట్లాడుతూ తాము కనుగొన్న సమాచారం రేడియేషన్‌ థెరపీకి సంబంధించిన కొత్త విధి విధానాలను రూపొందించడానికి ఉపకరిస్తుందని, రేడియేషన్‌ థెరపీ వల్ల వెంట్రుకలు, ఎముక మజ్జ వంటి వాటిపై పడే దుష్ప్రభావాలను తగ్గించి, క్యాన్సర్‌ కణాలపై అనుకున్న ప్రభావాన్ని కలిగించేందుకు ఎంతగానో ఈ సమాచారం దోహదపడుతుందని అన్నారు.

అలాగే శరీర గడియారం క్యాన్సర్‌ చికిత్సల రూపకల్పనకు దోహదపడుతుందని, అయితే తాము కనుగొన్న ఈ విషయాలు మానవుల క్యాన్సర్‌ చికిత్సల్లో ఉపయోగపడతాయా లేదా అనే విషయం ఇంకా తేలాల్సి ఉందని ఆయన అంటున్నారు. అయితే శరీరంలోని అవయవాలు, కణజాలాలకు సొంత గడియారాలు ఉంటాయనే విషయం స్పష్టమని, వీటిని గుర్తించి పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చినపుడు వాటిని అనుసరించి చికిత్స సమయాన్ని నిర్ధారించవచ్చని సచ్చిదానంద పాండా తెలిపారు.

  • Loading...

More Telugu News