: గాంధీ రక్త నమూనా విలువ ఏడువేల పౌండ్లు!
మహాత్మా గాంధీ రక్త నమూనాని వేలం వేస్తే అనూహ్యంగా అది ఏడువేల పౌండ్ల ధర పలికింది. బ్రిటన్‌లో మహాత్మాగాంధీకి చెందిన కొన్ని వస్తువులను వేలం వేశారు. గాంధీ వాడిన తోలు చెప్పులు, ఆయనే స్వయంగా నేసిన శాలువా, జపమాల వంటి కొన్ని వస్తువులతోబాటు ఆయన రక్త నమూనాని కూడా వేలంలో ఉంచారు. బ్రిటన్‌కు చెందిన ముల్లక్స్ ఆక్షనీర్స్ అనే సంస్థ ష్రావ్‌షైర్ పట్టణంలో మంగళవారం నాడు వీటిని వేలంలో విక్రయించింది. ఈ వేలంలో గాంధీజీ చేతి వ్రాతతో ఉన్న వీలునామా 55 వేల పౌండ్లు, ఆయనే స్వయంగా నేసిన శాలువా 40 వేల పౌండ్లు, ఆయన వాడిన తోలు చెప్పులు 19 వేల పౌండ్లు, జపమాల 9.5 పౌండ్లుకు అమ్ముడుపోయాయి.
గాంధీ 1920లో తన కుమారుడి పేరుమీద ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీని ఒకరు 25 వేల పౌండ్లు వెచ్చించి సొంతం చేసుకున్నారు. కింద గాంధీగారి సంతకం కూడా ఉన్న ధ్యానముద్రలో ఉన్న గాంధీగారి ఫోటోను 40 వేల పౌండ్లు పెట్టి ఒకరు సొంతం చేసుకోగా, ఆయన పఠించిన రామాయణ పుస్తకం మూడున్నర వేల పౌండ్లకు, లోహపుగిన్నె, ఫ్లాస్క్ 16,400 పౌండ్లకు, ఆయన వాడిన టోపీ 8,400 పౌండ్లకు అమ్ముడుపోయాయి. ఆయన 1920లో ఒకరికి రక్తదానం చేసిన సందర్భంగా ఆయన రక్త నమూనాను ఒక మైక్రోస్కోపిక్ స్లైడ్‌పై భద్రపరిచారు. ఈ స్లైడ్‌ను వేలం వేస్తే అది ఏడువేల పౌండ్ల ధర పలికింది.
ముల్లక్స్ సంస్ధ గత ఏడాది కూడా గాంధీ 1943లో జైలు నుండి రాసిన లేఖను ఒక లక్షా 15 వేల పౌండ్లకు, ఇంకా ఆయన హత్యకు గురైనప్పుడు గాంధీ రక్తంతో తడిసినదిగా పేర్కొంటున్న గడ్డిని 10 వేల పౌండ్లకు విక్రయించింది. మంగళవారం నాడు జరిగిన ఈ వేలంపాటలో గాంధీ వస్తువులతోబాటు విన్‌స్టన్ చర్చిల్, ఫ్లోరెన్స్ నైటింగేల్, హిట్లర్ తదితర ప్రముఖులకు చెందిన వస్తువులను కూడా వేలానికి పెట్టారు. వీటిలో గాంధీగారి వస్తువులకు మాత్రం అంచనాలకు మించిన ధర పలికాయి.