: కోట్లాలో 'చెన్నై' పప్పులుడకవ్: రోహిత్ శర్మ
ఐపీఎల్ లో ప్లే ఆఫ్ దశ ఆరంభం కాకముందే మాటలయుద్ధం మొదలైంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్ కు వేదికైన ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటలు సాగవని ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ హెచ్చరిస్తున్నాడు. ఐపీఎల్-6 లీగ్ దశ అనంతరం పాయింట్ల పట్టికలో చెన్నై, ముంబయి తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఈ రెండు జట్ల మధ్య నేడు ఢిల్లీలో తొలి క్వాలిఫయర్ పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
గెలవడానికే తాము ఇక్కడికి వచ్చామని అన్నాడు. చెన్నైపై నెగ్గి ఫైనల్ చేరాలన్నదే తమ లక్ష్యమని ఈ యువ క్రికెటర్ పేర్కొన్నాడు. రికీ పాంటింగ్ పేలవ ఫామ్ కనబర్చిన నేపథ్యంలో టోర్నీ ఆరంభ దశలోనే రోహిత్ కు ముంబయి ఇండియన్స్ పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. గత రెండేళ్ళుగా ముంబయి జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించడం తాజా ఐపీఎల్ సీజన్ లో తనకు ఎంతో ఉపకరించిందని ఈ తెలుగుతేజం వెల్లడించాడు.