: టీఆర్ఎస్ వసూళ్ళ చిట్టా సీబీఐకిచ్చిన రఘునందన్
టీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కీలక నేత రఘునందన్ నేడు సీబీఐ జేడీ లక్ష్మీనారాయణను కలిశారు. తన వద్ద ఉన్న టీఆర్ఎస్ వసూళ్ళకు చెందిన వివరాలను ఆయన సీబీఐ జేడీకి అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గతంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు జరిపిన ఆర్ధిక లావాదేవీల వివరాలను రాతపూర్వకంగా సీబీఐకిచ్చానని తెలిపారు. వాటిలో జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులు మ్యాట్రిక్స్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్, స్టయిలిష్ హోమ్స్ సీఎండీ రంగారావుల ప్రస్తావన కూడా ఉందని రఘునందన్ చెప్పారు. వారిద్దరి నుంచి టీఆర్ఎస్ పార్టీ అక్రమ వసూళ్ళకు పాల్పడిందని వివరించారు.
నిమ్మగడ్డ, రంగారావు ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నందున వారిని ఈ విషయమై విచారించాలని జేడీ లక్ష్మీనారాయణను కోరానని ఆయన పేర్కొన్నారు. ఇక తానందించిన సమాచారాన్ని స్వీకరించిన సీబీఐ.. ఈ వివరాలపై న్యాయనిపుణులతో సంప్రదించి, అవసరమైతే తనను పిలిపిస్తామని హామీ ఇచ్చినట్టు రఘునందన్ చెప్పారు.