: గెలాక్సీలు అనేకం ఉన్నాయ్...!
వినువీధిలో మన నక్షత్ర మండలం మాత్రమే కాదు... ఇంకా అనేకానేక నక్షత్ర మండలాలు ఉండే అవకాశం ఉందని ఎప్పటినుండో శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు. అయితే దీనికి ఇప్పటి వరకూ సిద్ధాంతపరమైన ఋజువులు లేవు. తాజాగా ఈ సిద్ధాంతానికి బలం చేకూర్చే ఒక ఆధారాన్ని సంపాదించామని చెబుతున్నారు నార్త్ కరోలినా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు.
యూరోపియన్ అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన ప్లాంక్ ఉపగ్రహం అందించిన సమాచారం ఆధారంగా లారా మెర్సినీ లాటన్, రిచర్డ్ హాల్మన్ అనే శాస్త్రవేత్తలు ఇటీవల ఒక పటాన్ని విడుదల చేశారు. ఈ పటం 1380 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం పుట్టుకకు కారణమైన బిగ్‌బ్యాంగ్ అనంతరం విశ్వంలో మిగిలిన రేడియోథార్మికత (కాస్మిక్ మైక్రోవేవ్) తాలూకు పటం. ఈ పటం విశ్వంలో ఉన్న ఇతర నక్షత్రం మండలాల ఉనికిని నిర్ధారిస్తోందని వారు పేర్కొంటున్నారు. ఈ పటంలో ఒక క్రమం అంటూ లేని ఆకృతులు ఉన్నాయని, పాలపుంతను ఇతర నక్షత్ర మండలాలు గురుత్వశక్తి వల్ల లాగడం వల్లే ఇలాంటి వికృతులు ఏర్పడ్డాయని వారంటున్నారు. దీన్నిబట్టి విశ్వంలో ఇతర నక్షత్ర మండలాలు ఉన్నాయని చెప్పవచ్చని వారంటున్నారు.