: స్పాట్ ఫిక్సింగ్ లో తెలుగు నిర్మాత?
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో టాలీవుడ్ లింకు బయటికొచ్చింది. శ్రీశాంత్ కు సన్నిహితుడైన ఓ తెలుగు సినీ నిర్మాతకూ ఫిక్సింగ్ పాపంలో భాగముందని ఢిల్లీ పోలీసుల విచారణలో తేలింది. ఆ నిర్మాతకు మరో రెండు రోజుల్లో సమన్లు జారీ చేయాలని పోలీసులు నిర్ణయించారు. హైదరాబాద్ లో శ్రీశాంత్ కు చెందిన ఎస్-36 సంస్థలో ఈ తెలుగు నిర్మాత కూడా భాగస్వామిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్-36 సంస్థ నగరంలో క్రీడోపకరణాలు, దుస్తుల వ్యాపారం నిర్వహిస్తోంది. శ్రీశాంత్ ల్యాప్ టాప్ ను ఓపెన్ చేసిన పోలీసులకు కీలక సమాచారం లభ్యం కావడంతో.. దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఈ కేరళ క్రికెటర్ కు అందమైన మోడళ్ళ ఫొటోలు పంపిన బాలీవుడ్ కాస్టింగ్ డైరక్టర్ ను ఢిల్లీ పోలీసులు నేడు ప్రశ్నించారు. అతన్నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు వారు యత్నిస్తున్నారు.