: 20 సెకన్లలో ఫుల్ ఛార్జింగ్..!
ఫీచర్ ఫోన్ల రంగప్రవేశం తర్వాత ఛార్జింగ్ త్వరత్వరగా తగ్గిపోవడం తెలిసిందే. ఎందుకుంటే, ఆ మొబైల్ ఫోన్లలో కెమేరా, ఆడియో వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎం రేడియో వంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. తద్వారా వినియోగం కూడా అదే స్థాయిలో ఉంటుంది. దీంతో, చార్జింగ్ తరచూ డౌనయిపోవడం చూస్తుంటాం.
సాకెట్లో ప్లగ్ పెట్టామంటే, ఎంతకాదనుకున్నా గంటపాటు మొబైల్ ను అలా వదిలేయకతప్పదు. ఇక ఆ చింత అక్కర్లేదంటోంది ఓ ఇండో-అమెరికన్ బాలిక. కాలిఫోర్నియాకు చెందిన ఈషా ఖరే అనే టీనేజర్ ఓ అపూర్వ ఆవిష్కరణను ప్రపంచం ముందుంచింది. 20 సెకన్లలోనే చార్జింగ్ పూర్తి చేసే ఓ నూతన పరికరాన్ని కనుగొంది.
ఈ సూక్ష్మ పరికరాన్ని సెల్ ఫోన్లో బ్యాటరీలతో అనుసంధానించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే సూపర్ కెపాసిటర్ తక్కువ స్థలంలో అపారమైన విద్యుత్ శక్తిని నిలవ చేసుకుంటుంది. అంతేగాకుండా, అత్యధిక సమయంపాటు ఆ శక్తిని స్థిరంగా కలిగి ఉంటుంది. మామూలు బ్యాటరీలు 1000 చార్జింగ్ లకే పరిమితమైన నేపథ్యంలో ఈ సూపర్ కెపాసిటర్ తో 10,000 సార్లు చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ తాజా ఆవిష్కరణను గుర్తిస్తూ 'ఇంటెల్' సంస్థ ఈషాకు రూ. 27 లక్షలు నగదు బహుమతిగా అందించింది.