: 'రాజీనామా' నిర్ణయం సీఎంకే వదిలేసిన ధర్మాన, సబిత


సీబీఐ తమపై చార్జిషీటు దాఖలు చేసినప్పుడే తాము రాజీనామా లేఖలు సమర్పించామని.. నిర్ణయం సీఎంకే వదిలేశామని మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబిత ఇంద్రారెడ్డి అంటున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నంత మాత్రాన దోషులం కాదని, కళంకితులం అంతకంటే కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఈ మధ్యాహ్నం కలిసిన అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. తొలుత ధర్మాన మాట్లాడుతూ.. పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకూడదనే గత ఆగస్టులోనే రాజీనామా లేఖ ఇచ్చానని వెల్లడించారు.

ఆ విషయంలో నాటికీ, నేటికీ తేడా లేదన్నారు. మంత్రుల నిర్ణయాల్లో క్యాబినెట్ కూ బాధ్యత ఉంటుందని చెబుతూ, వాన్ పిక్ ప్రాజెక్టుకు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 20 వేల ఎకరాలు కేటాయించాలన్న నిర్ణయం క్యాబినెట్ ద్వారానే తీసుకుందని వివరించారు. తొలుత సీఎంకు చెబితే, ఆయన ఆ విషయాన్ని క్యాబినెట్ లో పెట్టాలని ప్రతిపాదిస్తారని, ఆ విధంగానే తాను వాన్ పిక్ విషయంలో ముందుకెళ్ళానని తెలిపారు. ఈ వ్యవహారంలో రెవిన్యూ శాఖకు సంబంధం లేదని అన్నారు. ఆ భూ కేటాయింపుల్లో స్వంత నిర్ణయాలు ఏవీ లేవని ఆయన స్పష్టం చేశారు. తాను నిర్దోషినన్న విషయం కోర్టే చెబుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇక హోంమంత్రి సబిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, అప్పట్లో మైనింగ్ నిబంధనలకు లోబడే జీవోలు జారీ చేశానన్నారు. ఛార్జిషీటులో పేరు చూడగానే ఏప్రిల్లోనే రాజీనామా చేశానని చెప్పారు. జీవోల జారీ విషయంలో వ్యక్తిగత మేళ్ళు చూసుకోలేదని, సీబీఐ కూడా అవినీతికి పాల్పడ్డట్టు ఛార్జిషీటులో ఎక్కడా పేర్కొనలేదని తెలిపారు.

  • Loading...

More Telugu News