: మన పులులు అందుకే తగ్గిపోతున్నాయ్‌...!


మన దేశంలో పులుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతోంది. పులులను వేటగాళ్ల బారినుండి రక్షించేందుకు సేవ్‌ టైగర్‌ వంటి స్లోగన్‌లతో భారత ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అయితే వేటగాళ్లే కాదు... అసలు లోపం మన పులుల్లోనే ఉందట. జన్యులోపం కారణంగా మన దేశంలో పులుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోందట. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో కనుగొన్నారు. ప్రపంచంలోని పులుల్లో మన దేశంలో దాదాపు 60 శాతం పులులు ఉన్నాయి. అయితే వీటి సంఖ్య క్రమేపీ తగ్గిపోతోంది. దీనికి ప్రధాన కారణాలను గురించి శాస్త్రవేత్తలు అన్వేషించారు. తమ పరిశోధనల్లో దీనికి కారణం మన పులుల్లో జన్యు వైవిధ్యం తగ్గడం వల్ల వీటి సంఖ్య తగ్గుతోందని తేల్చారు. ఈ విషయం గురించి బ్రిటన్‌కు చెందిన కార్డిఫ్‌ స్కూల్‌ ఆఫ్‌ బయోసైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్‌ మైక్‌ బ్రుఫోర్డ్‌ మాట్లాడుతూ ఒకప్పుడు విశాలమైన అడవుల్లో తిరుగుతున్న పులులను రక్షించే పేరుతో వాటిని పరిమిత సంఖ్యలో ఒకచోటికి చేర్చడం వల్ల వాటి ఆవాసాలు కుదించుకుపోయాయని, ఒకేచోట కేవలం కొన్ని పులులనే చేర్చడం వల్ల వివిధ వంశాలకు చెందిన పులులతో కాకుండా అక్కడ ఉన్న పులులతోనే అవి జోడీ కట్టాల్సి రావడం వల్ల వాటి సంతానంలో జన్యు వైవిధ్యం లోపిస్తోంది. ఈ కారణం వల్ల పులులు పర్యావరణంలోని మార్పుల్ని తట్టుకొని మనలేకపోతున్నాయని తెలిపారు. అందువల్లే మనదేశంలో పులుల సంఖ్య తగ్గిపోతోందని బ్రూక్‌ చెబుతున్నారు.

బ్రిటిష్‌ పాలకులు మనదేశాన్ని పాలించే రోజుల్లో అనగా 1858`1947 మధ్యకాలం నాటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు బేరీజు వేసుకుంటే అప్పటి పులుల్లో జన్యు వైవిధ్యం బాగా ఎక్కువగా ఉండేదని, అదే ఈ కాలం నాటి పులులకు జన్యు వైవిధ్యం తగ్గిపోయిందని ఈ పరిశోధనలో బ్రూక్‌ తేల్చారు. దీనికితోడు ఆధునిక మారణాయుధాలతో వేటాడడం వంటి చర్యల వల్ల వాటి సంఖ్య మరింతగా తగ్గిపోయిందని, ఆ కాలంలో 40 వేల పులుల దాకా ఉండేవని, వందేళ్ల కాలం నాటికి వాటి సంఖ్య 1800 కి పడిపోయిందని ఆయన తెలిపారు. పులుల సంఖ్య తగ్గిపోవడాన్ని గుర్తించి వాటి సంఖ్యను పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితం లేకపోవడానికి కారణం వాటిలోని జన్యు వైవిధ్యం తగ్గిపోవడమేనని బ్రూక్‌ చెబుతున్నారు. ఈ ప్రమాదం బారినుండి పులుల జాతిని రక్షించాలంటే పులుల విశిష్ట జన్యు వైవిధ్యాన్ని కాపాడి వాటి సరికొత్త జన్యుమార్పిడికి అవకాశం కలిగేలా అభయారణ్యాలుగా ప్రకటించిన ప్రాంతాలను మరింత ఎక్కువగా సంరక్షించాలని, వాటి జన్యు వైవిధ్యానికి ఎక్కువ అవకాశం కల్పించాలని, వాటి పరిధిని మరింత విస్తృతం చేయాలని ఆయన సూచించారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను ‘ద రాయల్‌ సొసైటీ బి జర్నల్‌’ ప్రొసీడిరగ్స్‌లో ప్రచురించారు.

  • Loading...

More Telugu News