: పదిరోజుల్లో మూడు పర్వతాలెక్కుతా....!
మొక్కుబడులు తీర్చుకోవడానికి మనం ఏడుకొండలు నడిచి వెళ్లి కిందికి వచ్చేసరికి మనకు నిజంగానే వెంకన్న కనిపిస్తాడు కాళ్ల నొప్పికి. అయితే కూల్ మాత్రం చాలా కూల్‌గా తాను పది రోజుల్లో బాగా పేరున్న పెద్ద పెద్ద పర్వతాల్ని మూడింటిని ఎక్కాలని తహతహలాడుతున్నారు. తాను అనుకున్నది సాధించే దిశగా రెండో పర్వతంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కేశాడు.
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు కెంటన్ కూల్ పర్వతాలు ఎక్కడంలో ఘటికుడు. ఆయన ఇప్పటికి పదిసార్లు ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్టు (8,848 మీటర్లు ఎత్తు) శిఖరాన్ని ఎక్కేశాడు. అయితే ఆయన పదిరోజుల్లో నిరంతరాయంగా మూడు పర్వతాల్ని ఎక్కేసి రికార్డు సృష్టించాలని సంకల్పించాడు. ఈ సంకల్పంలో భాగంగా ఇప్పటికే నుపుట్సే అనే 7,861 మీటర్ల ఎత్తైన పర్వతాన్ని ఎక్కేశాడు. ఇక రెండవ పర్వతంగా ఎవరెస్టును ఎక్కేశాడు.
ఇక మూడవ పర్వతంగా 8,516 మీటర్లున్న లోట్సే పర్వతాన్ని ఎక్కేస్తే... ఇక రికార్డు తనదేనంటున్నాడు కూల్. తాను, తన భాగస్వామి డోర్జీ గ్లైగెన్ కూడా తమ లక్ష్యాన్ని చేరుకుని కొత్త రికార్డును సాధిస్తామని కూల్ తన ఫేస్‌బుక్‌లో చెబుతున్నాడు. అన్నట్లు కూల్ ఎవరెస్టును ఎక్కడం పదకొండోసారి... ఇది కూడా ఆయన ఖాతాలో ఓ రికార్డే. ఆయన ఎక్కబోయే మూడవ పర్వతం కూడా ఎవరెస్టుకు వెళ్లే మార్గంలోనే ఉంది. దీన్ని కూడా ఎక్కేసి తన లక్ష్యాన్ని కూల్ కూల్‌గా సాధిస్తాడేమో మనం కూడా కూల్‌గా చూద్దామా...!