Tollywood: తన గురించి జరుగుతోన్న ప్రచారంపై స్పష్టతనిచ్చిన యాంకర్ ప్రదీప్
- '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాలో హీరోగా ప్రదీప్
- గతంలో రెండు రోజుల జైలు శిక్ష అనుభవించారన్న శ్రీరామోజు
- అమ్మాయిని వేధించానని జరుగుతోన్న ప్రచారం అసత్యమన్న ప్రదీప్
తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రస్తుతం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాలో నటిస్తున్న యాంకర్ ప్రదీప్ ఖండించాడు. గతంలో ఓ అమ్మాయిని వేధించిన కేసులో రెండు రోజుల జైలు శిక్ష అనుభవించిన ప్రదీప్ ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నారని, ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ నిబంధనలకు విరుద్ధమని శ్రీరామోజు సునిశిత్ అనే దర్శకుడు ఫిర్యాదు చేశారు. ఈ సినిమా షూటింగును వెంటనే ఆపేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో ప్రదీప్ స్పందించాడు. తాను గతంలో డ్రంకెన్ డ్రైవ్ కేసులో పోలీసుల కౌన్సిలింగ్ కు హాజరైన విషయం నిజమేనని ప్రదీప్ అన్నాడు. అయితే, ఓ అమ్మాయిని వేధించానన్న వార్తల్లో నిజం లేదని చెప్పాడు. తనపై ఆ ఆరోపణలు చేసిన సదరు దర్శకుడు ఎవరో కూడా తనకు తెలియదని అన్నాడు. తన గురించి అసత్య వార్తలు ప్రచారం చేయకూడదని మీడియాని కోరాడు. కాగా, '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాలో ప్రదీప్ సరసన అమృత అయ్యర్ నటిస్తోంది. ఈ సినిమాకు మున్నా దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.