Jagan: అందుకే 'రాజధాని'పై కీలక నిర్ణయం తీసుకున్నాం: విశాఖపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- 'ఉద్యోగాల కోసం మన పిల్లలు ఇతర నగరాలకు వెళ్లే అవసరం ఉండకూడదు
- అమరావతి రాజధాని ప్రకటన ముందే భూములు కొనుగోలు చేశారు
- విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌లోనే నం.1 నగరం
- విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు విజయవాడలోని గేట్‌వే హోటల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... 'ఉద్యోగాల కోసం మన పిల్లలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు వెళ్లే అవసరం ఉండకూడదు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు అమరావతి రాజధాని ప్రకటన ముందే భూములు కొనుగోలు చేశారు' అని వ్యాఖ్యానించారు.
'గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌లోనే నం.1 నగరం. అమరావతి రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి రూ.1.09,000 కోట్లు అవసరమని గత ప్రభుత్వ నివేదికలే చెప్పాయి. ఒకవైపు అమరావతికి రూ.1.09,000 కోట్లు ఖర్చు చేయాలా? లేక రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలా? అని ఆలోచించాను' అని జగన్ చెప్పారు.
'కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులు వచ్చే అవకాశం లేదు. అమరావతిలో చేసే ఖర్చులో 10 శాతం విశాఖలో చేస్తే అద్భుతమైన రాజధాని తయారవుతుంది. అమరావతిలోనూ అభివృద్ధి కొనసాగుతుంది. ముఖ్యమంత్రిగా నేను రాబోయే తరం వారికి అన్ని సదుపాయాలు ఇక్కడే కల్పించాలి' అని జగన్ అన్నారు.
'ఉద్యోగాల కోసం మన పిల్లలు వేరే ప్రాంతానికి వెళ్లే పరిస్థితి ఉండకుండా చేయాలి. అమరావతిపై రాజకీయాలు చేస్తున్నారు. విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. విశాఖ నగరం మన ఊరు, మన నగరం, మన రాజధాని. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ ఉంటుంది. అక్కడే ముఖ్యమంత్రి కార్యాలయం, హెడ్‌వోడీ, సచివాలయం' ఉంటాయి అని చెప్పారు.