Chandrababu: కౌన్సిల్ ఎందుకంటూ జగన్ విచిత్రంగా మాట్లాడుతున్నారు!: చంద్రబాబునాయుడు
- కౌన్సిల్ నిర్వహణకు చాలా డబ్బు ఖర్చవుతుందట
- కౌన్సిల్ కు చేసేది వృథా ఖర్చట
- జగన్ కోర్టుకు హాజరయ్యేందుకయ్యే సెక్యూరిటీ ఖర్చు ఎంత?
అసెంబ్లీకే పవర్స్ ఉన్నాయని, అలాంటప్పుడు కౌన్సిల్ ఎందుకు? అంటూ సీఎం జగన్ విచిత్రంగా మాట్లాడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. మంగళగిరిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కౌన్సిల్ నిర్వహణకు చాలా డబ్బు ఖర్చవుతుందని, అదంతా వృథా అన్నట్టుగా జగన్ మాట్లాడారని విమర్శించారు.
ప్రతి శుక్రవారం హైకోర్టుకు జగన్ కు హాజరు కావాలంటే సెక్యూరిటీ ఖర్చుల నిమిత్తం రూ.60 లక్షలు అవుతుంది కనుక వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని న్యాయస్థానాన్ని జగన్ కోరిన విషయాన్ని ఈ సందర్భంగా బాబు ప్రస్తావించారు. ‘సంవత్సరానికి యాభై ఐదు వారాలు.. యాభై వారాలు లెక్కేసుకుందాం.. ముప్పై కోట్లు అయింది. ఒక నేరస్తుడు హైకోర్టుకు వెళ్లడానికి ముప్పై కోట్లు. కౌన్సిల్ కు రూ.60 కోట్లు వృథా ఖర్చు అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు’ అంటూ జగన్ పై ధ్వజమెత్తారు.