Chandrababu: బీజేపీతో మళ్లీ కలిసి పనిచేసే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు చంద్రబాబు సమాధానం ఇదే!

  • ఇలాంటి ఊహాజనిత ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను
  • బీజేపీ, జనసేనల పొత్తు వారి అంతర్గత వ్యవహారం
  • హైకోర్టును మార్చడం కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశం

రాజకీయాలలో ఏ పార్టీ అయినా ఏ పార్టీతో అయినా కలిసి పని చేయవచ్చని... అది ఆయా పార్టీల అంతర్గత వ్యవహారమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రెండు పార్టీలు పాటుపడితే స్వాగతిస్తామని చెప్పారు. బీజేపీ, జనసేన పొత్తుపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియా ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. బీజేపీతో టీడీపీ మళ్లీ కలిసే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు సమాధానంగా... ఇలాంటి ఊహాజనిత ప్రశ్నలకు తాను సమాధానం ఇవ్వలేనని చెప్పారు.

వైసీపీ ప్రభుత్వ ఆలోచనలన్నీ తప్పుడు మార్గంలో నడుస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాలు, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. విశాఖను తాను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. హైకోర్టును తరలించడం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదని... అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమని అన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని తాము చెప్పామని తెలిపారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిందని... ఆ పని వారు చేయాలకుంటే తాము మద్దతిస్తామని చెప్పారు.

కర్నూలు సమీంపలోని ఓర్వకల్లును తాము ఎంతో అభివృద్ధి చేశామని... ఎయిర్ పోర్టును కూడా నిర్మించామని... వైసీపీ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఆ ఎయిర్ పోర్టుకు ఒక్క విమానం కూడా రాలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాము ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రారంభించామని... వైసీపీ వాటిని ఎందుకు కొనసాగించలేకపోయిందని ప్రశ్నించారు.

More Telugu News