Ameerpet: అమీర్ పేటలో పిచ్చికుక్కల దాడి ఘటనపై హెచ్ఆర్సీలో పిటిషన్
- హెచ్ఆర్సీలో బాలల హక్కుల సంఘం పిటిషన్
- జీహెచ్ఎంసీ, పశువైద్య అధికారులపై మండిపాటు
- నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు డిమాండ్
హైదరాబాద్ లోని అమీర్ పేటలో పాఠశాల విద్యార్థులపై పిచ్చికుక్కలు దాడి చేసిన ఘటన విషయమై జీహెచ్ఎంసీ, పశువైద్య అధికారులపై బాలల హక్కుల సంఘం మండిపడుతోంది. వీరి నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తూ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)లో ఓ పిటిషన్ దాఖలు చేసింది.
అమీర్ పేటలో పిచ్చికుక్కల దాడి ఘటనల్లో సుమారు యాభై మంది వరకు గాయపడ్డారని హెచ్ఆర్సీ దృష్టికి బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుత్ రావు తీసుకెళ్లారు. ఈ ఘటనలో బాధితులకు వైద్య ఖర్చులను ప్రభుత్వం చెల్లించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని ఆ పిటిషన్ లో డిమాండ్ చేశారు.