Congress: ఆర్మీని అవమానిస్తారా.. సిగ్గులేదూ?: కాంగ్రెస్‌పై రాంమాధవ్ మండిపాటు

  • పార్లమెంట్, పుల్వామా దాడులపై పునర్విచారణా?
  • పాకిస్థాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చేంతగా దిగజారాలా
  • కాంగ్రెస్ తీరును ఎండగడతాం

పౌరసత్వ సవరణ బిల్లుపై అసోంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పుల్వామా, పార్లమెంట్ దాడులపై పునర్విచారణ చేయాలన్న ఆ పార్టీ డిమాండ్‌ను తీవ్రంగా తప్పుబట్టారు. ఇది సిగ్గుచేటైన విషయమన్నారు. పాకిస్థాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చేంతగా కాంగ్రెస్ పార్టీ దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మీ పనితనాన్ని, వారి త్యాగాలను కాంగ్రెస్ అవమానిస్తోందని దుయ్యబట్టారు.

పౌరసత్వ సవరణ చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో కాంగ్రెస్ తీరును ఎండగడతామని రాంమాధవ్ అన్నారు. సీఏఏపై అపోహలను, అవాస్తవాలను కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఎటువంటి అంశాలు దొరక్క పోవడంతో ప్రతిపక్షాలు దుష్ప్రచారాన్ని ప్రారంభించాయన్నారు. వాటిని తిప్పికొట్టి మోదీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందని రాంమాధవ్ పిలుపునిచ్చారు. సీఏఏపై ఇటీవల ట్వీట్ చేసిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కాంగ్రెస్ దుష్ప్రచారంలో ఇరుక్కున్నారని రాంమాధవ్ విమర్శించారు.

More Telugu News