Andhra Pradesh: అమరావతి శక్తిపీఠం... దీన్ని తీసే శక్తి ఎవరికీ లేదు: చంద్రబాబు

  • వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజం
  • రైతులు సీఆర్డీఏతో ఒప్పందం కుదుర్చుకున్నారని వెల్లడి
  • ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసే హక్కు ప్రభుత్వానికి లేదని స్పష్టీకరణ

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజధాని అమరావతి అంశంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఓ శక్తిపీఠం అని, దాన్ని తీసే శక్తి ఎవరికీ లేదని స్పష్టం చేశారు. రాజధాని రైతులు సీఆర్డీఏతో ఒప్పందం చేసుకున్నారని, ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసే హక్కు ప్రభుత్వానికి లేదని అన్నారు. అమరావతి రైతులకు అన్ని హక్కులు ఉన్నాయని, సీఆర్డీఏ పరిధిలో నవ నగరాలు వస్తాయని చెప్పామని వివరించారు. అమరావతి, పోలవరాన్ని రెండు కళ్లుగా భావించానని, అమరావతి కోసం 18 మంది రైతులు చనిపోవడం ఎంతో బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులకు 200 గజాలు ఎక్కువ ఇస్తామని ఓ మంత్రి చెబుతున్నారని, అమరావతి 29 గ్రామాల సమస్య కాదని, ఐదు కోట్ల మంది ప్రజల సమస్య అని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని, దాని ఆటలు ఇక సాగనివ్వబోమని పేర్కొన్నారు. వైసీపీ తప్ప అన్ని పార్టీలు అమరావతికి మద్దతిస్తున్నాయని స్పష్టం చేశారు. పదవుల కోసం ప్రజలను తాకట్టుపెడితే చరిత్ర క్షమించదని అన్నారు. అమరావతి కోసం జీవితంలో తొలిసారి జోలె పట్టానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

తమ హయాంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శ్రీకారం చుట్టామని, ఉత్తరాంధ్రకు పరిశ్రమలు వచ్చి, తద్వారా అక్కడివారికి ఉపాధి లభించాలన్నది తమ ఆకాంక్ష అని తెలిపారు. విశాఖ జిల్లాకు ఎన్నో పరిశ్రమలు తెచ్చానని, ఇప్పుడవన్నీ పారిపోయాయని  అన్నారు. రాజధాని మార్పు అంటూ అగ్గితో చెలగాటమాడుతున్నారని, భస్మమైపోతారంటూ హెచ్చరించారు. అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు.

More Telugu News