Sangareddy District: ఆడ పిల్ల పుట్టిందని ఊరంతా సంబరం చేసుకున్నారు!

  • సంగారెడ్డి జిల్లా హరిదాస్‌పూర్‌లో ఘటన
  • తగ్గిపోతున్న అమ్మాయిల సంఖ్య 
  • అమ్మాయిల తల్లిదండ్రులను పిలిపించి సన్మానం

అబ్బాయిలు-అమ్మాయిల జననాల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండడంతో ఆడపిల్ల పుడితే బాగుండునని గ్రామస్థులు అనుకున్నారు. వారి కోరిక నెరవేరింది. జనవరి తొలి వారంలో ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో వారి సంతోషం అంబరాన్నంటింది. అందరూ కలిసి గ్రామంలో సంబరాలు చేసుకున్నారు.  మిఠాయిలు పంచుకుని వేడుక జరుపుకున్నారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం హరిదాస్‌పూర్ గ్రామంలో జరిగిందీ ఘటన.

గ్రామంలో మొత్తం 816 మంది నివసిస్తున్నారు. అయితే, అబ్బాయిలు-అమ్మాయిల మధ్య లింగ నిష్పత్తిలో అంతరం ఎక్కువగా ఉండడంతో ఆవేదన చెందారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తు మనుగడకే ముప్పు రావొచ్చని భయపడ్డారు. ఇలా అయితే లాభం లేదని ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. జనవరి మొదటి వారంలో ముగ్గురు అమ్మాయిలు జన్మించడంతో నిన్న గ్రామంలో అందరూ కలిసి వేడుక చేసుకున్నారు.

పంచాయతీ కార్యాలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. అనంతరం అమ్మాయిల తల్లిదండ్రులను అక్కడికి పిలిపించి సన్మానించారు. సుకన్య సమృద్ధి యోజన పథకం కింద పేర్లు నమోదు చేయించారు. ఒక్కో చిన్నారికి వెయ్యి రూపాయల చొప్పున  తొలి ఐదు నెలల మొత్తాన్ని జమ చేశారు. ఇందుకు సంబంధించి మూడు వేల రూపాయలను వారి చేతికి అందించారు. విషయం తెలిసిన ఇరుగుపొరుగు గ్రామస్థులు హరిదాస్‌పూర్ వాసులను అభినందిస్తున్నారు.

More Telugu News