: నేటితో ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లకు తెర
నెల రోజులుగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొలి దశ నేటితో ముగియనుంది. 9 జట్లు 72 లీగ్ మ్యాచ్ లతో సిసలైన క్రికెట్ మజాను అందించాయి. ఇక మంగళవారం నుంచి రెండో రౌండ్ ఆరంభం కానుంది. తొలి దశ రౌండ్ రాబిన్ లీగ్ కాగా.. తదుపరి దశ ప్లే ఆఫ్ విధానంలో ఉంటుంది. లీగ్ దశ ముగిసిన అనంతరం పాయింట్ల పట్టికలో తొలి నాలుగు జట్లు ఈ దశకు అర్హత పొందుతాయి.
ఇప్పటికే ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ బెర్తులు ఖాయం చేసుకోగా.. నాలుగో స్థానం కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య దోబూచులాట నెలకొంది. ఈ రోజు సాయంత్రం కోల్ కతా నైట్ రైడర్స్ తో పోరులో సన్ రైజర్స్ (18 పాయింట్లు) విజయం సాధిస్తే.. బెంగళూరు (18 పాయింట్లు) ఇంటిముఖం పడుతుంది. అలాకాకుండా, సన్ రైజర్స్ ఓటమిపాలైతే.. బెంగళూరు నాలుగో జట్టుగా ప్లే ఆఫ్ రౌండ్ లో అడుగిడుతుంది.
ఇక ప్లే ఆఫ్ దశ ఎలా ఉంటుందంటే.. ఇందులో మూడు మ్యాచ్ లుంటాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు తొలి మ్యాచ్ ఆడతాయి. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓటమిపాలైన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఎలాగంటే.. పాయింట్ల పట్టికలో 3,4 స్థానాల్లో నిలిచిన జట్లు ఓ ఎలిమినేషన్ మ్యాచ్ ఆడతాయి. ఇందులో ఓడితే ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది. ఈ పోరులో గెలిచిన జట్టు తొలి ప్లే ఆఫ్ మ్యాచ్ లో పరాజయంపాలైన జట్టుతో ఆడాల్సి ఉంటుంది. అంటే, ప్లే ఆఫ్ లో ఇది మూడో మ్యాచ్ అన్నమాట. దీంట్లో నెగ్గిన జట్టు ఫైనల్ కు అర్హత సాధిస్తుంది.