New Delhi: అగ్ని మాపక ఉద్యోగి అమిత్ బలియాన్ కుటుంబానికి రూ.కోటి పరిహారం

  • ప్రకటించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 
  • నిన్న రాజధానిలోని ఓ భవనంలో ప్రమాదం 
  • సహాయక చర్యలు చేపడుతుండగా పేలుడులో అమిత్ మృతి

ఢిల్లీ అగ్నిమాపక శాఖ ఉద్యోగి అమిత్ బలియాన్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ప్రకటించింది. బలియాన్ త్యాగం వెలకట్టలేనిదని, అయినా ప్రభుత్వ బాధ్యతగా ఈ పరిహారం అందజేస్తున్నామని సీఎం కేజ్రీవాల్ ఈ సందర్భంగా ప్రకటించారు. దేశ రాజధానిలో బ్యాటరీలు తయారు చేసే ఓ కర్మాగారంలో నిన్న అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. దీంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. వారిలో అమిత్ బలియాన్ కూడా ఉన్నారు.

ఉదయం ఏడు గంటల సమయంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. దీంతో భవనం లోపల మంటలు ఆర్పుతుండగా సెంట్రల్ సెక్షన్లో పేలుడు సంభవించి భవనం కుప్పకూలిపోయింది. దీంతో శిథిలాల కింద బలియాన్ తోపాటు మొత్తం ముగ్గురు చిక్కుకున్నారు. మధ్యాహ్నం 2.20 గంటలకు శిథిలాలు తొలగించి బలియాన్ ను బయటకు తీసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. అమిత్ కు తొమ్మిది నెలల క్రితమే వివాహం జరిగింది. భార్య, తల్లిదండ్రులతో అమిత్ మీర్ నగర్ లో ఉంటున్నాడు. ఈ విషాద ఘటన పై ఢిల్లీ సీఎం తీవ్రంగా స్పందించారు. భారీ ఆర్థిక సాయం ప్రకటించడమేకాక, ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు.

More Telugu News