Vijayawada: ఏపీ దేవాదాయ శాఖ 2020 క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి వెల్లంపల్లి

  • ఆలయాల పవిత్రతను, భూములను కాపాడుతున్నాం
  • గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ క్యాలెండరు ఉంది
  • వైసీపీ ప్రభుత్వం ఏ కులానికో, మతానికో చెందింది కాదు: వెల్లంపల్లి

ఏపీ దేవాదాయ శాఖ 2020 క్యాలెండర్ ను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆవిష్కరించారు. విజయవాడలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో దేవదాయ శాఖ కమిషనర్ ఎం.పద్మ, దుర్గగుడి ఈవో సురేష్ బాబు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా 12 ముఖ్య దేవాలయాల చిత్రాలను ఈ క్యాలెండర్‌లో ముద్రించినట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేవాదాయ శాఖలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఆలయాల పవిత్రతను, దేవాలయాల భూములను కాపాడుతున్నామని చెప్పారు.

అన్యమత ప్రచారమంటూ ఇతర రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. సెర్చ్ ఇంజిన్ గూగుల్ లో టీటీడీకి సంబంధించి స్పెల్లింగ్ మిస్టేక్ వస్తే దానిని కూడా రాజకీయం చేస్తున్నారని, ’గూగుల్‌’లో జరిగే తప్పులను ప్రభుత్వంపై నెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఏ కులానికో, మతానికో చెందింది కాదని, పారదర్శకంగా పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

More Telugu News