Jagan: ఒక్క క్లిక్కుతో 85,000 'నేతన్న'ల ఖాతాల్లో డబ్బులు వేసిన జగన్.. తనకు వచ్చిన మెసేజ్ చూపి ఉబ్బితబ్బిబ్బయిన వ్యక్తి!
- ధర్మవరంలోనే అక్షరాలా 10,700 కుటుంబాలకు లబ్ధి అన్న జగన్
- అనంతపురం జిల్లాలో 27,000 మందికి మేలు
- ల్యాప్ టాప్ లో జగన్ బటన్ క్లిక్ చేయగానే లబ్ధిదారులకు మెసేజ్ లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించారు. పథకం ప్రారంభించిన రెండు గంటలకే ఆయన లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు పడేలా చర్యలు తీసుకున్నారు. ఒకే ఒక్క క్లిక్కుతో వారి ఖాతాల్లో డబ్బులు వేశారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. 'చేనేత కుటుంబాలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ బటన్ నొక్కుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 85 వేల కుటుంబాలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. ఈ ధర్మవరంలోనే అక్షరాలా 10,700 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ జిల్లాలోనే ఈ అనంతపురం జిల్లాలో అక్షరాలా 27,000 మందికి మేలు జరుగుతుందని తెలియజేస్తున్నాను' అని తెలిపారు.
ల్యాప్ టాప్ లో జగన్ బటన్ క్లిక్ చేయగానే లబ్ధిదారులకు మెసేజ్ లు వచ్చాయి. దీంతో వారంతా హర్షం వ్యక్తం చేశారు. ఓ లబ్ధిదారుడు తనకు వచ్చిన మెసేజ్ చూపెడుతూ ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. మరి కొద్ది సమయంలో మీ ఖాతాలో రూ.24,000 జమ అవుతుందని అందులో ఉంది.