IPL-2020 Auction: ఐపీఎల్-2020 వేలంలో ఆసీస్ పేసర్ కమిన్స్ కు అత్యధిక ధర

  • రూ.15.5 కోట్లకు పాట్ కమిన్స్ ను దక్కించుకున్న కేకేఆర్
  • రూ.10.75 కోట్లకు గ్లెన్ మాక్స్ వెల్ ను సొంతం చేసుకున్న కింగ్స్ పంజాబ్   
  • మొత్తం 73 స్లాట్లుండగా వేలం బరిలో ఎనిమిది జట్ల యాజమాన్యాలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 కోసం ఆటగాళ్లను దక్కించుకునేందుకు జట్ల యాజమాన్యాలు పోటాపోటీగా ఈ రోజు జరిగిన వేలం ప్రక్రియలో పాల్గొన్నాయి. మొత్తం 73 స్లాట్లు అందుబాటులో ఉండగా, ప్రతీ జట్టులో అత్యధికంగా 25 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకునే వీలుంటుంది. మొత్తం 8 జట్ల యాజమాన్యాలు ఈ పోటీలో పాల్గొన్నాయి.  కోల్ కతా వేదికగా సాగిన ఈ వేలం పాటలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ రూ.15.5 కోట్లకు అమ్ముడుపోయాడు. ఇది  ఐపీఎల్ లీగ్ చరిత్రలోనే ఒక ఆటగాడికి దక్కిన అత్యధిక ధర. కమిన్స్ ను కోల్ కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది.

 కాగా, గ్లెన్ మాక్స్ వెల్ ను రూ. 10.75 కోట్లకు కింగ్స్ పంజాబ్ ఎలెవన్ దక్కించుకుంది. ఈ వేలం పాటలో మొత్తం 332 మంది ఆటగాళ్లున్నారు.  కొత్తగా వినయ్ కుమార్, అశోక్ దిండా, మాథ్యూ వేడ్, జేక్ వీదర్లాండ్, రాబిన్ బిస్త్, సంజయ్ యాదవ్ వేలం జాబితాలో చోటు సంపాదించడంతో ఈ సంఖ్య 338కి చేరింది. ఇందులో 134 మంది క్యాప్ డ్ ఆటగాళ్లుండగా, 198 మంది అన్ క్యాప్ డ్ ఆటగాళ్లున్నారు.

More Telugu News