Chandrababu: చంద్రబాబు జీవోను పూర్తిగా చదివారా? లేక ఇంగ్లీషును అర్థం చేసుకోలేకపోయారా?: జగన్
- అసెంబ్లీని కుదిపేస్తున్న 2430 జీవో
- చంద్రబాబు తీరు ఆశ్చర్యకరంగా ఉందన్న జగన్
- ఆయనకు ఇంగితజ్ఞానం కూడా లేదని తీవ్ర వ్యాఖ్యలు
ఏపీ అసెంబ్లీని 2430 జీవో కుదిపేస్తోంది. మీడియా స్వేచ్ఛను హరించేలా ఈ జీవోను తీసుకొచ్చారని... వెంటనే జీవోను రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. మీడియాకు సంకెళ్లు వేసి ఈ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అసెంబ్లీకి కొన్ని ఛానళ్లను నిరాకరించడం దుర్మార్గమని అన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడే వరకు తమ పోరాటం సాగుతుందని చెప్పారు. ఈ అంశంపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ, జీవోపై చంద్రబాబు తీరు ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. చంద్రబాబు జీవోను పూర్తిగా చదివారా? లేక ఇంగ్లీషును అర్థం చేసుకోలేకపోయారా? అని ఎద్దేవా చేశారు. నిరాధార వార్తలు రాసే వారిపై ఫిర్యాదు చేసే అధికారాన్ని సంబంధిత శాఖలకు ఈ జీవో ద్వారా కల్పించామని చెప్పారు. 'ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ' అని చెప్పుకునే చంద్రబాబుకు ఇంగితజ్ఞానం కూడా లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ జీవోలో తప్పు పట్టడానికి ఏమీ లేదని చెప్పారు.