Disa: నలుగురిని చంపినోడిని జైల్లోనే బతకనిస్తారా?: మందకృష్ణ మాదిగ

  • పసి మొగ్గలను శ్రీనివాస్ రెడ్డి హతమార్చాడు
  • అతని కంటే దిశ నిందితులు ప్రమాదకారులైతే కాదు
  • శ్రీనివాస్ రెడ్డికి ఆ తీర్పు ఎందుకు వర్తించలేదు?

దిశ కోసం నిందితులు నలుగురిని జైల్లో నుంచి బయటకు తీసుకొచ్చి కాల్చిపారేశారు కదా, హాజీపూర్ ఘటనలో నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని జైల్లో ఎందుకు మేపుతున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పసి మొగ్గలను శ్రీనివాస్ రెడ్డి హతమార్చాడని, గతంలోనే ఇతనికి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉందని, కర్నూలులో ఓ మహిళను హతమార్చాడని అన్నారు.

‘ఒక్కరిని చంపిన నలుగురు నిందితులను జైల్లో వుంటే బయటకు తీసుకొచ్చి చంపారు కదా, నలుగురిని చంపిన శ్రీనివాస్ రెడ్డి గారికి ఆ తీర్పు ఎందుకు వర్తించలేదు?’ అని ప్రశ్నించారు. దిశ ఘటనలో నిందితులది ఎన్ కౌంటర్ కాదు ‘సామూహిక హత్యా కాండ. ‘రెడ్డి’ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లు, అగ్రకులాలు, రాజకీయంగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వాలను, పార్టీలను ప్రభావితం చేసేటోళ్లు, శాసించేటోళ్లు వ్యవస్థను చెప్పుచేతల్లో పెట్టుకుని చేయించిన దారుణమైన హత్యలు ఇవన్నీ’ అని ఆరోపించారు.

‘చంపబడ్డ నలుగురిలో అగ్రకులస్థులెవ్వరూ లేరు. శ్రీనివాస్ రెడ్డి గారి కంటే ప్రమాదకారులైతే కాదు. వాళ్లు నిందితులే.. తప్పు తప్పే. కానీ, తప్పుకు శిక్ష ఒక దిక్కు కాల్పులు, ఒక దిక్కు మేపడాలా? జైల్లో నుంచి తీసుకొచ్చి నలుగురిని చంపుతారు! నలుగురిని చంపినోడిని జైల్లోనే బతకనిస్తారా? అందరికీ సమానమైన శిక్షలు ఎందుకు లేకుండా పోయాయి?’ అని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు.

More Telugu News