: సన్ రైజర్స్ బౌలర్లకు ద్రావిడ్ మెచ్చుకోలు
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్.. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ వారు అమోఘంగా రాణించారని కితాబిచ్చాడు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు 23 పరుగుల తేడాతో రాజస్థాన్ పై జయభేరి మోగించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులు చేయగా.. కష్టసాధ్యంకాని లక్ష్యంతో బరిలో దిగిన ద్రావిడ్ సేన 20 ఓవర్లలో 9 వికెట్లకు 113 పరుగులే చేసి ఓటమిపాలైంది.
ఆతిథ్య జట్టు బౌలర్లలో అమిత్ మిశ్రా (2/8), స్టెయిన్ (2/17), కరణ్ శర్మ (2/33), పెరెరా (2/25) సమయోచితంగా రాణించి ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేశారు. పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా రెండు వికెట్లు తీసిన లెగ్ స్పిన్నర్ మిశ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. పోరు ముగిసిన అనంతరం రాజస్థాన్ సారథి ద్రావిడ్ మీడియాతో మాట్లాడుతూ, సన్ రైజర్స్ బౌలర్లు మిడిల్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ ఫలితాన్ని శాసించారని కొనియాడాడు. అంతేగాకుండా, ఫిక్సింగ్ కారణంగా ముగ్గురు సహచరులు దూరమైనా, మిగతా ఆటగాళ్ళు స్థైర్యాన్ని కోల్పోలేదని చెప్పుకొచ్చాడు.