Telugudesam: టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలి: చంద్రబాబునాయుడు
- పశ్చిమగోదావరి జిల్లా ఒకప్పుడు టీడీపీ కంచుకోట
- మళ్లీ బలపడేందుకు కార్యాచరణ ప్రణాళిక
- తణుకులో నియోజకవర్గ స్థాయి సమీక్షలో బాబు
పశ్చిమగోదావరి జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోట అనీ, జిల్లాలో మళ్లీ బలపడేందుకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. తణుకులో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలు, నాయకులతో తాను మమేకమయ్యేలా కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నామని, పూర్వ వైభవం మళ్లీ టీడీపీకి రావాలని కోరారు.
ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం పనితీరు వల్ల ‘పోలవరం’ ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టును డెబ్బై ఒక్క శాతం పూర్తి చేశామని, ఇప్పుడు ఆ ప్రాజెక్టును భ్రష్టుపట్టించే పరిస్థితికి వచ్చారని, చాలా దుర్మార్గంగా ప్రవర్తించారని, రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వం తెలిసి చేసినా, తెలియక చేసినా రాష్ట్రానికి మాత్రం తీవ్ర నష్టం జరిగిందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.