Jagan: ఇంగ్లిష్ మీడియం పెడితే కొన్ని సమస్యలు వస్తాయని తెలుసు: సీఎం జగన్
- చరిత్రను మార్చే తొలి అడుగు వేస్తున్నాం
- వాటిని అధిగమించేందుకు బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేస్తాం
- ఒకట్రెండు ఏళ్లు కష్టపడ్డా ఇంగ్లిష్ మీడియంలో ముందుకెళతారు
పేదరికం నుంచి బయట పడాలంటే చదువు ఒక్కటే మార్గమని ఏపీ సీఎం జగన్ అన్నారు. చరిత్రను మార్చే తొలి అడుగు వేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం బాలల దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఒంగోలులో ‘మనబడి నాడు నేడు’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. 'ప్రభుత్వ నిర్ణయాలపై ఆరోపణలు చేసేవారు హిపోక్రసీని వదలి డెమొక్రసీకి విలువ ఇవ్వాలి. ఇంగ్లిష్ మీడియం పెడితే కొన్ని సమస్యలు వస్తాయని తెలుసు. వాటిని అధిగమించేందుకు బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేస్తాం. ఒకట్రెండు ఏళ్లు కష్టపడ్డా ఆ తర్వాత పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో ముందుకెళతారు' అని చెప్పారు.
'ప్రతి ఏడాది పాఠశాలలకు రూ.3500 కోట్లు ఖర్చు చేస్తాం. 45 వేల పాఠశాలల రూపు రేఖలను మార్చుతాం. పాఠశాలల్లో అన్ని వసతులు తీసుకొస్తాం. ఉన్నత చదువులు చదువుతోన్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంటు పథకాన్ని కూడా తీసుకొస్తున్నాం. హాస్టల్ లో ఉన్న విద్యార్థులకు ఖర్చుల కోసం ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. ప్రతి పార్లమెంటు నియోజక వర్గంలో స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రం ఏర్పాటు చేస్తాం. 5 నెలల్లో 4 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాం' అని జగన్ వ్యాఖ్యానించారు.