Chandrababu: ఆకలికి తట్టుకోలేని కూలీలు ఆలయాల్లో ప్రసాదాలపై ఆధారపడుతున్నారంటే ఎంత దయనీయం!: చంద్రబాబు ఆవేదన
- వైసీపీ సర్కారుపై చంద్రబాబు ధ్వజం
- కూలీలను ఇంత దారుణ పరిస్థితుల్లోకి నెడతారా? అంటూ ఆగ్రహం
- ఇప్పుడైనా అన్న క్యాంటీన్లు తెరవాలంటూ హితవు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో కూలీల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. కూలీల ఉపాధిని ప్రభుత్వం కాలరాస్తే ఆకలి బాధ తట్టుకోలేని కొందరు కూలీలు ఆలయాల్లో అన్నప్రసాదాలపై ఆధారపడి బతుకుతున్నారని వివరించారు. మరో చోట మెతుకు కోసం చెత్తకుప్పల్లో వెతుకుతున్న ఓ కూలీని తలుచుకుంటే కళ్లు చెమర్చుతున్నాయని ట్వీట్ చేశారు.
ప్రజలకు ఇంత దయనీయ పరిస్థితులు తీసుకువచ్చినందుకు వైసీపీ ప్రభుత్వ పాలకులు సిగ్గుపడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన ఈ ఐదు నెలల్లో మీరు సాధించిన ఘనకార్యం ఇదేనా? అంటూ నిలదీశారు. కనీసం ఇలాంటి పరిస్థితుల్లో 'అన్న క్యాంటీన్' ఉన్నా కూలీల కడుపు నింపేదని తెలిపారు. ఇప్పుడైనా అన్న క్యాంటీన్లను తెరిచి పేదలను, కూలీలను ఆదుకోవాలని హితవు పలికారు.