Chandrababu: చంద్రబాబు ఇంగ్లీష్ పై ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చురకలు!
- గతంలో 'బ్రీఫ్డ్ మీ' అంటూ నారా వారు మాట్లాడారు
- కమిషన్ కోసం గత ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసింది
- ఇంగ్లిష్ మీడియంలో బోధన జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం
- దీనిపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు.. ఇది సరికాదు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇంగ్లిషులో మాట్లాడితే జాతీయ ఛానళ్లే ఆశ్చర్యపోతాయని ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. మరోవైపు నారా వారు ఇంగ్లిషులో ఎలా మాట్లాడతారో మనం చూశామని, 'బ్రీఫ్డ్ మీ' అని గతంలో అన్నారని గుర్తు చేశారు. అప్పట్లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి, స్టీఫెన్సన్, చంద్రబాబు నాయుడు మధ్య ' మనవాళ్లు బ్రీఫ్డ్ మీ' సంభాషణ కలకలం రేపిన విషయం తెలిసిందే. జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రతిభా విజేతలకు పురస్కారాలను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంజాద్ బాషా ఈ వ్యాఖ్యలు చేశారు.
కమిషన్ కోసం రూ.వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని గత చంద్రబాబు ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని అంజాద్ బాషా ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంగ్లిష్ మీడియంలో బోధనను అందుబాటులోకి తీసుకురావడం ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. దీనిపై చాలా మంది విమర్శలు చేస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రోజునే అభివృద్ధి సాధ్యమని, తమ సర్కారు సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెప్పారు. మైనారిటీలకూ మంచి విద్య అందిస్తామని చెప్పారు.