Yanamala: ఆత్మహత్యలపై అధికార పార్టీ హేళన తగదు: టీడీపీ నేత యనమల

  • విపక్షాలపై విమర్శలకే మంత్రులు పరిమితం
  • ఈ ప్రభుత్వం హయాంలో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం
  • ఆర్థిక నేరాల్లో జగన్‌కు శిక్ష పడడం ఖాయం

రాష్ట్ర ప్రభుత్వంపై శాసన మండలిలో ప్రతిపక్ష నేత, టీడీపీ సీనియర్‌ నాయకుడు యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. రాజమండ్రిలో ఈరోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేతినిండా పని దొరికి హాయిగా జీవితాలు వెళ్ళదీసుకున్న భవన నిర్మాణ కార్మికులను వీధిన పడేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని విమర్శించారు. 'అన్నమో రామచంద్రా' అంటూ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మంత్రులు వాటిపై హేళనగా మాట్లాడుతుండడం సిగ్గుచేటన్నారు.

విపక్షాలపై విమర్శలు చేయడానికే మంత్రులు ఉన్నారన్నట్లు వారి వ్యవహార శైలి ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని ధ్వజమెత్తారు. రాజధానికి సంబంధించి సింగపూర్‌ కన్సార్టియంను ఎందుకు రద్దు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

జగన్‌కు సీబీఐ కోర్టు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునకు అంగీకరించకపోవడంపై స్పందిస్తూ క్రిమినల్‌ నేరాల కంటే ఆర్థిక నేరాలు బలమైనవని, జగన్‌కు శిక్ష పడడం ఖాయమని వ్యాఖ్యానించారు.

More Telugu News