Chandrababu: స్వేచ్ఛను హరిస్తారా?.. ఆ జీవోను రద్దు చేయాల్సిందే: చంద్రబాబు
- నిన్న జీవో 2430ను తీసుకొచ్చిన ప్రభుత్వం
- నిరాధార వార్తలు రాస్తే ఇక కఠిన చర్యలు
- ప్రజాస్వామ్య హక్కును కాలరాయడం తగదన్న మాజీ సీఎం
ప్రజాస్వామ్యం కల్పించిన హక్కును కాలరాసేలా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద జీవోను రద్దు చేయకుంటే రోడ్డెక్కి నిరసన తెలిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ప్రశ్నించడం, విమర్శించడం, వైఫల్యాలను ఎత్తి చూపడమనేది ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు అని అన్నారు. ప్రజా గొంతుకను నొక్కేసేందుకే ప్రభుత్వం ఈ జీవో 2430ను తీసుకొచ్చిందని మండిపడ్డారు. ఇటువంటి జీవోలతో మీడియా సంస్థలను భయపెట్టాలనుకోవడం సరికాదన్నారు. ఆ జీవోను రద్దు చేసే వరకు పోరాడతామని, అవసరమైతే రోడ్డెక్కేందుకు సైతం తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
నిరాధార వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా ఆయా సంస్థల ఎడిటర్లు, పబ్లిషర్లపై చర్యలు తీసుకునేలా ఏపీ ప్రభుత్వం నిన్న ఓ జీవోను జారీ చేసింది. అలాగే, ఈ జీవో ప్రకారం సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు పోస్టు చేసే వ్యక్తులపైనా కఠిన చర్యలు తీసుకోనున్నారు.