Chandrababu: ఆయన వల్లే కాలేదు, ఈయనేం చేస్తాడు?: సీఎం జగన్ పై చంద్రబాబు విసుర్లు
- కొండను తవ్వి వెంట్రుక కూడా పట్టలేకపోయారని ఎద్దేవా
- వైఎస్సార్ 26 కమిటీలు వేసి ఏమీ సాధించలేకపోయాడని వ్యాఖ్యలు
- ప్రభుత్వం మద్యం దుకాణాలు నడపడంపై విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అవినీతిని వెలికితీస్తామంటూ ప్రకటించి ఏమీ చేయలేకపోయారని వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు. అప్పుడెవరో కొండను తవ్వి ఎలుకను పడితే వీళ్లు కనీసం వెంట్రుకను కూడా పట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనపై 26 కమిటీలు వేసి ఏం సాధించలేకపోయారని, ఆయన వల్లే కాలేదు, ఇప్పుడు ఈయనేం చేయగలడు? అంటూ జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక ప్రభుత్వ మద్యం పాలసీ గురించి వ్యాఖ్యలు చేస్తూ, మద్యం తాగిన మందుబాబులు జగన్ ను ఇష్టంవచ్చినట్టు తిడుతున్నారని అన్నారు. ప్రభుత్వమే మద్యం అమ్మడమేంటని ప్రశ్నించారు.