JC: ఆయన వైపు నుంచి సరైన ఆహ్వానం రాకపోతే నేనేం చేసేది?: జేసీ
- జగన్ తో వ్యక్తిగత వైరం లేదన్న జేసీ
- రాజకీయ విభేదాలు ఉండొచ్చని వ్యాఖ్యలు
- ఎదురుపడితే మాట్లాడతానని వెల్లడి
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎం అయ్యాక కలిసి అభినందించే అవకాశం రాలేదని వెల్లడించారు. ఎదురుపడితే తప్పకుండా మాట్లాడతానని స్పష్టం చేశారు. జగన్ కుటుంబంతో తమకు సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు. జగన్ పెద్దమ్మ ఎన్నికల ముందు ఓసారి తనతో మాట్లాడారని వెల్లడించారు.
"ఎంత పనిచేస్తివన్నా, మీరందరూ దూరమైపోయారు అని అడిగింది. ఆయన వైపు నుంచి సరైన ఆహ్వానం లేకపోతే నన్నేం చేయమంటావు చెప్పు అన్నాను. ఇప్పటికీ జగన్ అన్నా, ఆయన కుటుంబ సభ్యులన్నా వ్యక్తిగతంగా ఎంతో గౌరవం ఉంది" అని జేసీ వివరించారు. ఇప్పుడు మరో పార్టీలోకి వెళ్లేందుకు తాను సిద్ధంగా లేనని, కానీ జగన్ తదితరులు ఎక్కడన్నా కనిపిస్తే మాత్రం మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని వివరణ ఇచ్చారు. వాళ్లు తనకేమీ వ్యక్తిగత శత్రువులు కారని, రాజకీయ విభేదాలు ఉంటాయని తెలిపారు.