Chandrababu: మీ తెగువ, పట్టుదల ప్రశంసనీయం: ధర్మాడి సత్యానికి లేఖ రాసిన చంద్రబాబు

  • మీరు పెట్టిన శ్రద్ధలో ప్రభుత్వం ఒక శాతమైనా చూపించి ఉంటే బాగుండేది
  • మీరు జడివానలో బోటును బయటకు తీస్తుంటే సీఎం విహారయాత్రలకు వెళ్లారు
  • బాధిత కుటుంబాల కన్నీటిని తుడిచారు

కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన బోటును బయటకు తీసిన ధర్మాడి సత్యానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లేఖ రాశారు. ఆయన తపన, తెగువ ప్రశంసనీయమని పేర్కొన్నారు. పడవను వెలికి తీయడంలో సత్యం బృందం కనబరిచిన శ్రద్ధలో ఒక్కశాతమైనా ప్రభుత్వం చూపించి ఉంటే బాధిత కుటుంబాలకు ఇప్పుడీ దురవస్థ ఉండేది కాదని, ఇన్ని ప్రాణాలు గాల్లో కలిసి ఉండేవి కావని అన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్న ధర్మాడి బృందం తపన, బోటును బయటకు తీయాలన్న ఆయన పట్టుదలను అభినందిస్తున్నట్టు చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు.

అధికారుల వెంటపడి మరీ బోటును బయటకు తీస్తానని సత్యం చెప్పినట్టు తాను పేపర్లలో చదివానన్న చంద్రబాబు.. వారి స్ఫూర్తి అందరిలోనూ నెలకొనాలని కోరుకుంటున్నానన్నారు. తమ వారిని కడసారి చూడలేక కుంగిపోతున్న బాధిత కుటుంబాలకు ఎంతో ఊరట కల్పించారని, వారికి అంత్యక్రియలు నిర్వహించి ఆత్మశాంతికి మార్గం చూపారని కొనియాడారు.

బాధితుల కన్నీళ్లను పట్టించుకోకుండా సీఎం విహారయాత్రల కోసం విదేశాలు వెళ్తే, సత్యం బృందం  వారి కుటుంబాలను వదిలి, అన్నపానీయాలు మాని జడివానలోనూ బోటు వెలికితీతకు ప్రయత్నించిందని, వారి తపనను తెలుగుదేశం పార్టీ మనస్ఫూర్తిగా అభినందిస్తోందని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు.  

More Telugu News