Andhra Pradesh: రేపు భార్యాభర్తలు కాపురం చేయాలన్నా ‘J-ట్యాక్స్’ కట్టే పరిస్థితి వస్తుందేమో!: చంద్రబాబు సెటైర్లు
- వైసీపీ ప్రభుత్వం ఏదో చేసిందని చెప్పుకుంటున్నారు
- ఇంత వరకూ ఒక తట్ట మట్టి కూడా వేయలేదు
- ఎవరి పొలంలో వాళ్లు మట్టి తీసుకోవాలంటే డబ్బు కట్టాలా?
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంధించిన వ్యంగ్యాస్త్రాలు నవ్వులు పుట్టించాయి. గుంటూరులో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ హయాంలో చేసిన పనులు ఆదర్శవంతంగా ఉన్నాయని, ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేశామని, మురుగు కాల్వలు కట్టించామని, శ్మశానాలు ఏర్పాటు చేశామని, ఏడు లక్షల పంటగుంటలు తవ్వామని గుర్తుచేశారు. ఆ పంట గుంటలకు ఈ ఏడాదిలో పదిసార్లు నీళ్లొచ్చాయని, తద్వారా భూగర్భజలాలు పెరిగి కరవు తీరిందని అన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఏదో చేసిందని వాళ్ల నాయకులు చెప్పుకుంటున్నారని, ఇంత వరకూ ఒక తట్ట మట్టి కూడా వేయలేదని విమర్శించారు. ఇరిగేషన్ కు సంబంధించి ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని మండిపడ్డారు. ఎవరి పొలంలో వాళ్లు మట్టి తీసుకోవాలంటే అధికారుల అనుమతి కావాలా? అందుకు మైనింగ్ శాఖకు డబ్బుల కట్టాలా? అంటూ మండిపడ్డ బాబు, ‘J- ట్యాక్స్.. జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ కట్టాలా! రేపు భార్యాభర్తలు కాపురం చేయాలన్నా J-ట్యాక్స్ కట్టే పరిస్థితి వస్తుంది’ అంటూ జగన్ పై సెటైర్లు వేసిన చంద్రబాబు నవ్వులు పూయించారు.