: హిమానీ నదాలు కరిగిపోతున్నాయ్‌...!


భూభాగంపై ఉన్న మంచుతో కూడివున్న హిమానీ నదాలు కరిగిపోతున్నాయి. దీంతో సముద్రమట్టం పెరిగిపోతోందని ఒక తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2003, 2009 సంవత్సరాల మధ్యకాలంలో సముద్రమట్టం పెరిగిపోవడంపై పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ పెరుగుదలకు కారణం హిమానీ నదాలు కరిగిపోవడమేనని ఈ తాజా పరిశోధనలో తేలింది. భూమిపై సుమారు 99 శాతం మంచు గ్రీన్‌ల్యాండ్‌, అంటార్కిటిక్‌ మంచు పలకల మధ్యే ఉందని, అయితే 2003 నుండి 2009 మధ్యకాలంలో హిమానీ నదాలు ఉండే ప్రాంతాలు ద్రవ్యరాశిని కోల్పోవడం వల్ల మంచు ఎక్కువగా కరిగినట్టుగా పరిశోధకులు గుర్తించారు. ద్రవ్యరాశిని కోల్పోవడం వల్ల ఆర్కిటిక్‌ కెనడా, అలాస్కా, గ్రీన్‌ల్యాండ్‌ తీరప్రాంతం, హిమాలయాలు, దక్షిణ యాండిస్‌ ప్రాంతాల్లో మంచు ఎక్కువగా కరిగిందని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయన కాలంలో గ్రీన్‌ల్యాండ్‌, అంటార్కిటిక్‌ మంచు పలకల మధ్యనున్న హిమానీనదాల్లో సరాసరి ఏటా 260 బిలియన్‌ మెట్రిక్‌ టన్నుల మంచు కరిగిందని, దీనివల్ల సముద్ర మట్టం ఏటా 0.03 అంగుళాల మేర పెరిగినట్టు శాస్త్రవేత్తలు వివరించారు.

పరిస్థితి ఇలాగే ఉండి ప్రపంచంలోని అన్ని హిమానీ నదాలు కరిగిపోతే సముద్రమట్టం ఎత్తు రెండు అడుగుల మేర పెరుగుతుందని, ఒక్క గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు మొత్తం కరిగిపోతే సముద్ర మట్టం 20 అడుగుల ఎత్తు మేర పెరుగుతుందని, అంటార్కిటిక్‌ ప్రాంతాలోని మంచు మొత్తం కరిగిపోతే అపుడు సముద్ర మట్టం 200 అడుగుల మేర పెరుగుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ సమాచారాన్ని పరిశోధకులు నాసాకు చెందిన ఐస్‌, క్లౌడ్‌, ల్యాండ్‌ ఎలివేషన్‌ శాటిలైన్‌ నుండి సేకరించారు. ఈ విషయం గురించి తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఇలా ద్రవ్యరాశి కోల్పోవడానికి కారణాలేంటో కూడా కనుగొంటే ఆ కోణంలో జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందికదా... అప్పుడు రానున్న ముప్పు కొంతైనా తగ్గించవచ్చేమో...!

  • Loading...

More Telugu News