: సౌరకుటుంబం పుట్టుక గుట్టు రట్టుకానుంది...?!
విశ్వంలో సౌరకుటుంబం పుట్టుక ఎలా జరిగింది అనేది అంతుబట్టని రహస్యం. అయితే త్వరలో ఈ రహస్యం గుట్టు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు నాసా శాస్త్రవేత్తలు. అమెరికా అంతరిక్షయాన సంస్థ నాసా తొలిసారిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రహశకల మిషన్ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ మిషన్ రూపకల్పన, పరీక్ష తుది దశలో ఉంది. ఈ మిషన్ పూర్తయితే 2016 నాటికి దీన్ని ప్రయోగించాలని నాసా భావిస్తోంది. వందకోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ మిషన్‌కు ఓసిరిస్`రెక్స్ అనే పేరు పెట్టబడిరది. ఇది కీ డెసిషన్ పాయింట్ (కెడీపీ)`సి అనే నిర్ధారణ సమీక్ష దశను దిగ్విజయంగా అధిగమించింది. దీని అనంతర దశను ప్రారంభించేందుకు కూడా దీనికి అధికారికంగా అనుమతి లభించింది.
2016లో ప్రయోగించబోయే ఓసిరిస్`రెక్స్ అంతరిక్షనౌక 2018 నాటికి బెన్ను అనే గ్రహశకలాన్ని తాకి, దానిపైని నమూనాలను సేకరించి తిరిగి 2023 నాటికి భూమికి తిరిగొస్తుంది. ఈ బెన్ను అనే గ్రహశకలంపై సౌరకుటుంబం పుట్టుకకు సంబంధించిన జాడలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బెన్నుపైకి వెళ్లే ఓసిరిన్`రెక్స్ దాని రేఖా చిత్రాలను రూపొందిస్తుంది, భూమినుండి టెలీస్కోపు ద్వారా సేకరించిన సమాచారాన్ని పోల్చి చూస్తుంది. బెన్ను ఉపరితలం నుండి సుమారు 60 గ్రాముల పదార్ధాన్ని సేకరించి భూమిపైకి తీసుకురానుంది. ఈ విషయం గురించి ప్రాజెక్ట్ మేనేజర్ మైక్ డానెలీ మాట్లాడుతూ కెడీపీ`సి స్థాయిని అధిగమించడం తమ ఓసిరిస్`రెక్స్ ప్రాజెక్టులో నిజంగా ఒక మైలురాయి లాంటిదని, గ్రహశకలం నుండి నమూనాలను తీసుకురావడానికి అవసరమైన తగిన ప్రణాళిక తమ వద్ద ఉందని నాసా విశ్వసిస్తోందని వివరించారు.