YSRCP: వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు: చంద్రబాబు
- నెల్లూరులో వైసీపీ బాధితులతో చంద్రబాబు సమావేశం
- దాడులు చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు
- మా కార్యకర్తల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదు
నెల్లూరులో వైసీపీ బాధితులతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని, ఆ పార్టీ నేతలు దాడులు చేస్తూ పైశాచికానందం పొందుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని, జగన్ పులివెందుల పంచాయితీ రాష్ట్ర వ్యాప్తంగా జరగదు అని, ఆయన్ని పులివెందుల పంపే దాకా వెనుకాడమని అన్నారు.
తమ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చంద్రబాబు హెచ్చరించారు. కొంతమంది పోలీసులు తమ కార్యకర్తలపై కేసులు బనాయిస్తున్నారని, ఇటువంటి వాటిని సహించమని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వెంకటగిరి ఎంపీడీవో సరళ ఇంటిపై దౌర్జన్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి ప్రస్తావించారు. సరళను ఎనిమిది గంటల పాటు పోలీస్ స్టేషన్ ముందు కూర్చోబెట్టారని, ఎమ్మెల్యే కోటంరెడ్డిని అరెస్టు చేసి రెండు గంటల్లో విడిచి పెట్టారని విమర్శించారు. ఆరువందల మందిపై దాడులు చేశారని, అక్రమ కేసులు బనాయించారని నిప్పులు చెరిగారు.
తన ఇంటిపై డ్రోన్లు ఎగరేశారు అని, గేట్లకు తాళ్లు కట్టారని, ఆ తాళ్లే వారికి ఉరితాళ్లవుతాయంటూ వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఏపీలో ఊరికో ఇసుకాసురుడు తయారయ్యాడు, ఇసుక బెంగళూరుకి తరలిపోతోంది అని ఆరోపించారు. ఇసుక ధర ఆరేడు రెట్లు పెరిగిందని, తక్కువ ధరకే ఇసుక ఇచ్చే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.
మద్యం ధరలు విపరీతంగా పెరిగాయని, జీఎస్టీతో ‘జే ఎస్టీ’ విధిస్తున్నారంటూ జగన్ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. గోదావరిలో బోటు మునిగిన ఘటనపై బాబు మాట్లాడుతూ, ఇంకా 13 మృతదేహాలు వెలికితీయలేదు అని విమర్శించారు. ‘రైతు భరోసా’ పథకం ఓ బూటకం అని, ఆ జాబితాలో ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయని, సీఎం పేరు కూడా ఉంటుందేమో? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.‘టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పులు చెల్లించకుంటే, నువ్వు చేసిన అప్పులు రేపు ఎవరు చెల్లించాలి?’ అని సీఎం జగన్ ని ప్రశ్నించారు. కేసీఆర్, జగన్ కలిసి ప్రాజెక్టుల పేరుతో రూ.లక్ష కోట్లు కొట్టేసే ప్లాన్ చేశారని బీజేపీ వారే అంటున్నారని వ్యాఖ్యానించారు.