: మహిళా న్యాయమూర్తికీ తప్పని వరకట్న వేధింపులు
మధ్యప్రదేశ్ లో ఓ మహిళా న్యాయమూర్తి.. భర్త వరకట్న వేధింపులతో విసిగిపోయింది. జౌరా తెహ్సిల్ పట్టణంలో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గా విధులు నిర్వర్తిస్తున్న సరితా జటారియా తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం తెమ్మంటూ నిరంతరం దూషించడమే కాకుండా శారీరకంగానూ హింసిస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. వేధింపుల్లో భాగంగా ఈరోజు ఉదయం తనను తీవ్రంగా కొట్టడంతో సరిత భరించలేకపోయింది. గాయాలపాలైన సరిత వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఆమె భర్త వికాస్ జౌరా పట్టణంలోనే ఎల్ఐసీలో పనిచేస్తున్నాడు. భార్య తనపై కేసు దాఖలు చేసిందని తెలుసుకున్న వికాస్ వెంటనే పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.