Jagan: అభినందించాల్సింది పోయి.. బండలు వేస్తున్నారు: చంద్రబాబుపై జగన్ విమర్శలు
- గాంధీ జయంతి రోజున మద్యం అమ్మారని చంద్రబాబు అన్నారు
- ఆ రోజున ఎక్కడైనా మద్యం షాపు తెరిచి ఉందా?
- ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే తట్టుకోలేకపోతున్నారు
గాంధీ జయంతి రోజున రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. రాష్ట్ర రాజకీయాలు ఎలా జరుగుతున్నాయో అందరూ చూస్తున్నారని... మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేత అభినందించాల్సింది పోయి, బండలు వేస్తున్నారని విమర్శించారు. ఏలూరులో వైయస్సార్ వాహన మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గాంధీ జయంతి రోజున దేశంలో కనీవినీ ఎరుగని విధంగా గ్రామ సెక్రటేరియట్ వ్యవస్థను ప్రారంభించామని... ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే విషయాన్ని తట్టుకోలేక, గాంధీ జయంతి రోజున మందు అమ్ముతున్నారంటూ చంద్రబాబు అభాండాలు వేశారని జగన్ అన్నారు. గాంధీ జయంతి రోజున ఎక్కడైనా మందు షాపు తెరిచి ఉందా? అని మీ అందరినీ అడుగుతున్నానని ప్రశ్నించారు. ఇంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పట్టపగలే అబద్ధాలు మాట్లాడటం సబబేనా? అని అడుగుతున్నానని చెప్పారు. ఇలాంటి రాజకీయాలను చూసినప్పుడు మనసుకు బాధ కలుగుతుందని... కానీ, మీ అందరి ముఖాల్లో చిరునవ్వులు చూసినప్పుడు సంతృప్తి వస్తుందని అన్నారు.