Hyderabad: హైదరాబాదులో దారుణం... అమీర్ పేటలో సైంటిస్టు హత్య
- తన ఇంట్లోనే హత్యకు గురైన శాస్త్రవేత్త
- తలపై బలమైన గాయం
- హత్యకేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్ లో ఓ సైంటిస్టు దారుణహత్యకు గురయ్యారు. అమీర్ పేటలో నివసించే ఎస్.సురేశ్ కుమార్ తన నివాసంలో గుర్తు తెలియని దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన వయసు 56 సంవత్సరాలు. సురేశ్ కుమార్ బాలానగర్ లో ఉన్న నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలో సీనియర్ సైంటిస్టుగా పనిచేస్తున్నారు. ఆయన గత రెండు దశాబ్దాలుగా అమీర్ పేటలో నివాసం ఉంటున్నారు.
సురేశ్ కుమార్ భార్య ఇందిర ఉద్యోగరీత్యా గత 17 సంవత్సరాలుగా చెన్నైలో నివసిస్తున్నారు. ఆమె ఇండియన్ బ్యాంకులో మేనేజర్. గతంలో అమీర్ పేట బ్రాంచ్ లో పనిచేసిన ఆమెకు చెన్నై బదిలీ అయింది. అప్పటినుంచి సురేశ్ కుమార్ ఒక్కరే ఉంటున్నారు. అయితే, ఈ ఉదయం ఆఫీసుకు వెళ్లాల్సిన ఆయన ఎంతకీ రాకపోవడంతో సహోద్యోగులు ఫోన్ చేశారు. ఫోన్ ఎవరూ లిఫ్ట్ చేయకపోగా, కొద్దిసేపటికి అది స్విచాఫ్ అయింది. దాంతో వారు చెన్నైలో ఉన్న ఆయన భార్య ఇందిరకు సమాచారం అందించగా ఆమె హైదరాబాద్ బయల్దేరి వచ్చారు.
ఆమె సమక్షంలో పోలీసులు ఇంటి తలుపులు తెరిచి లోపలికి వెళ్లిచూడగా సురేశ్ కుమార్ రక్తపుమడుగులో కనిపించారు. ఆయన తలపై బలమైన గాయం ఉండడంతో అది హత్యేనని భావించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించారు.