: ప్రేమికులకు రక్షణ కల్పించండి: హెచ్ఆర్సీ
వేలంటైన్స్ డే.. నాడు (ఫిబ్రవరి14) యువతీ, యువకులు ప్రేమ పక్షుల్లా విహరిస్తుంటారు. ముఖ్యంగా నగరాలలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ, ప్రేమికుల దినోత్సవాన్ని భజరంగ్ దళ్ ఎప్పటినుంచో వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇది మన భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని చెబుతూ ఏటా ఆ రోజున నిరసన వ్యక్తం చేస్తోంది. అంతేకాదు, ఆ రోజున భజరంగ్ దళ్ కార్యకర్తలు నగరాలలో సంచరిస్తూ కనిపించిన జంటలకు బలవంతంగా పెళ్ళిళ్ళు చేయిస్తున్నారు.
ఎప్పటిలానే ఈ ఏడాది కూడా వేలంటైన్స్ డే (రేపు) రోజున ప్రేమికులు చెట్టాపట్టాలేసుకుని కనిపిస్తే పట్టుకుని కల్యాణం జరిపిస్తామని భజరంగ్ దళ్ రాష్ట్ర శాఖ హెచ్చరించింది. విదేశీ సంస్కృతిని ప్రోత్సహిస్తే ఊరుకోమని ప్రకటించింది. దీనిపై ఈ రోజు రాష్ట్ర మానవహక్కుల సంఘం స్పందించింది. భజరంగ్ దళ్ బలవంతపు పెళ్ళిళ్ళను అడ్డుకోవడానికి చర్యలు చేపట్టాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ను ఆదేశించింది.