Vijayawada: ప్రభుత్వ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం...యువకుడికి వైకల్యం

  • కాలికి వైద్యం కోసం వెళితే చేయి పనిచేయకుండా పోయింది
  • ఇంక్షన్‌ వేయడంలో జరిగిన పొరపాటుతో సమస్య
  • కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాధితుడు

 ప్రభుత్వ వైద్యు సిబ్బంది నిర్లక్ష్యం ఇప్పుడు ఓ యువకుడు వికలాంగుడిగా మారడానికి కారణమైంది. కాలికి దెబ్బతగిలిందని వైద్యం కోసం వెళితే అక్కడి సిబ్బంది నిర్వాకం పుణ్యాన ఇప్పుడు చేయి కూడా పనిచేయక పోవడంతో లబోదిబోమంటున్నాడు. వివరాల్లోకి వెళితే...తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం కె.కొత్తపూడికి చెందిన గుమ్మడి రాజు (27) విజయవాడలోని ఓ దుస్తుల దుకాణంలో పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితం ద్విచక్ర వాహనం స్టాండ్‌ తగిలి కాలికి గాయమైంది. అది పెద్దది కావడంతో విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం వెళ్లాడు.

అక్కడి వైద్యుడు కాలిగాయాన్ని శుభ్రం చేసి కట్టుకట్టాడు. ఆ తర్వాత వైద్య సిబ్బంది ఒకేసారి రెండు చేతులకు రెండు ఇంజక్షన్లు వేశారు. ఆ తర్వాత ఆ యువకుడు ఇంటికి వెళ్లిపోయాడు. అయితే మరునాటికి ఎడమ చెయ్యి పనిచేయడం లేదని గుర్తించాడు. దీంతో ఆసుపత్రికి వచ్చి విషయం చెప్పగా వారు సమస్య గుర్తించకుండా ‘మా ఇంజక్షన్‌ వల్లే ఇలా జరిగిందంటావా?’ అని ఎగతాళిగా మాట్లాడారని బాధితుడు చెబుతున్నాడు.

అక్కడ పిండికట్టు వేసి పంపినా ఫలితం కనిపించకపోవడంతో బాధితుడు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు పరిశీలించి ఇంజక్షన్‌ చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అది నరాలకు తగిలిందని, దీనివల్ల సమస్య వచ్చిందని, మళ్లీ చెయ్యి తిరిగి పనిచేయడం అసాధ్యమని చెప్పడంతో హతాశుడయ్యాడు. దీంతో బాధితుడు తన కుటుంబ సభ్యులతో వచ్చి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడిని నిలదీశాడు.

దీంతో కంగారుపడిన సిబ్బంది వైద్యం చేసి బాగు చేస్తామని, బాగుకాకుంటే పరిహారం ఇప్పిస్తామంటూ నమ్మబలికారు. తనకు డబ్బు అక్కర్లేదని, చెయ్యి పనిచేసేలా చేయాలని, లేదంటే జీవితాంతం వికలాంగుడిగా మిగిలిపోతానంటూ బాధితుడు ఆసుపత్రి ముందు నిన్న ధర్నాకు దిగాడు. అనంతరం కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణకు ఆదేశించారు.

More Telugu News