Andhra Pradesh: అక్రమాలు బయటపెడితే దాడి చేస్తారా? చీరాల విలేకరిపై దాడి చేస్తారా!: వైసీపీపై చంద్రబాబు ఫైర్
- నాగార్జున రెడ్డిపై వైసీపీ నేతల దాడి అమానుషం
- ఎస్పీకి వినతి పత్రం ఇచ్చి వస్తుంటే దాడి చేశారు
- పోలీసులు ఏం చేస్తున్నారు?
వైసీపీ ప్రభుత్వం తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. వైసీపీ పాలనలో అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని, అందుకు ఉదాహరణ చీరాల విలేకరిపై జరిగిన దాడి అని అన్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడుతూ చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు.
‘చీరాల విలేకరి నాగార్జున రెడ్డిపై వైసీపీ నేతలు చేసిన దాడి అమానుషమని, అక్రమాలు బయటపెడితే కక్షగడతారా? పదేపదే దాడి చేస్తారా? ఎస్పీకి వినతి పత్రం ఇచ్చి వస్తుంటే దాడి చేశారంటే పోలీసులు ఏం చేస్తున్నారు?’ అని ప్రశ్నించారు. ఇంతకుముందు కూడా మరో వైసీపీ నేత, పాత్రికేయుని ఇంటికి వెళ్ళి ప్రాణాలు తీస్తామని బెదిరించి వచ్చారని ఆరోపించారు.
‘ముఖ్యమంత్రిగారేమో తన దొంగ పత్రిక సాక్షి తప్ప మరో పత్రిక ఉండకూడదంటారు. ఏమిటీ నిరంకుశత్వం? ఇది నాగరిక రాజ్యమా? కరడుగట్టిన కాలకేయ రాజ్యమా?’ అని విరుచుకుపడ్డారు.