: ఢిల్లీ పోలీసులకు షిండే ప్రశంస
ఐపీఎల్-6లో ఫిక్సింగ్ రాకెట్ ను ఛేదించిన ఢిల్లీ పోలీసులను కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే అభినందించారు. ఢిల్లీలో నేడు జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీ పోలీసులపై ప్రశంసల వర్షం కురిపించారు. 'వారెప్పుడు మంచి పని చేసినా మెచ్చుకుంటాను' అని తెలిపారు. ఇటీవల నిర్భయ అత్యాచారం, ఐదేళ్ళ చిన్నారిపై దారుణ లైంగిక దాడులతో ప్రతిష్ఠ మసకబారిన నేపథ్యంలో హోం మంత్రి ప్రశంస నిస్సందేహంగా ఢిల్లీ పోలీసులకు ఉత్సాహాన్నిచ్చేదే. ఇక, ఈ ఫిక్సింగ్ కుంభకోణంలో మాఫియా ప్రమేయంపై ప్రశ్నించగా.. విచారణ సాగుతున్న సమయంలో ఈ అంశంపై వ్యాఖ్యానించడం తొందరపాటే అవుతుందని షిండే పేర్కొన్నారు.