Sivprasad: టీడీపీ మాజీ ఎంపీ, సినీ నటుడు శివప్రసాద్ కన్నుమూత
- చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన శివప్రసాద్
- మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న మాజీ ఎంపీ
- శివప్రసాద్ వయసు 68 సంవత్సరాలు
ప్రముఖ సినీ నటుడు, టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూశారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. 1951 జూలై 11న చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పులిత్తివారిపల్లి గ్రామంలో ఆయన జన్మించారు. 1999 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేగా పని చేశారు. సమాచార, సాంస్కృతిక మంత్రిగా శివప్రసాద్ పని చేశారు. 2009, 2014లో చిత్తూరు నుంచి ఎంపీగా గెలుపొందారు. పలు సినిమాల్లో నటించి, ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో వినూత్న రీతిలో నిరసనలు చేపట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన దర్శకుడు కూడా. ప్రేమతపస్సు, టోపీ రాజా- స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరోకో వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన క్లాస్ మేట్ అనే విషయం తెలిసిందే.