Jagan: ఒక్కో ఉద్యోగం రూ.5 లక్షలకు అమ్ముతున్నారన్న వార్తలపై ఎందుకు స్పందించడంలేదు?: సీఎం జగన్ పై లోకేశ్ ఫైర్

  • సచివాలయ ఉద్యోగాల పరీక్ష పేపరు లీక్ అంటూ కథనాలు
  • తీవ్రంగా స్పందించిన లోకేశ్
  • పూర్తి స్థాయి విచారణ జరగాల్సిందేనంటూ వ్యాఖ్యలు

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ నియామక పరీక్ష ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే అధినేత చంద్రబాబునాయుడు ఇదో పేపర్ లీక్ స్కాం అంటూ ధ్వజమెత్తగా, ఎమ్మెల్సీ నారా లోకేశ్ కూడా ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు. పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ అంటే పరీక్ష పేపరు లీక్ చేయడమా? అంటూ మండిపడ్డారు. 1.26 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించిన మీరు, 18 లక్షల మందికి పైగా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని ఆరోపించారు. ఇదేనా మీ విశ్వసనీయత? అంటూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు.

"ప్రభుత్వ ఉద్యోగం కోసం నిరుద్యోగులు నిద్రాహారాలు మాని కష్టపడి చదివి పరీక్ష రాస్తే మీ పెద్దలు పరీక్ష పేపరును ముందే ఎత్తుకెళ్లిపోయారు. ఒక్కో ఉద్యోగాన్ని రూ.5 లక్షలకు అమ్ముతున్నట్టు వస్తున్న ఆరోపణలపై మీరు ఎందుకు స్పందించడంలేదు. వైసీపీ దళారులు పరీక్ష పేపరు అమ్మేసిన వైనం మీ మంత్రి పెద్దిరెడ్డికి ముందే తెలుసన్నది నిజం. నిరుద్యోగుల ఆశలు అడియాసలయ్యాయి, వాళ్ల కన్నీళ్లకు ఖరీదు కట్టి చెల్లిసారా? ఉద్యోగాల పేరుతో మీ తుగ్లక్ ప్రభుత్వం నిండా ముంచింది. మీపై నిరుద్యోగుల తిరుగుబాటు తప్పదు. పేపర్ లీక్ కుంభకోణంపై పూర్తి స్థాయి విచారణ జరగాల్సిందే" అంటూ లోకేశ్ డిమాండ్ చేశారు.

More Telugu News